

కుప్పం, మన ధ్యాస : బుధవారం నాడు కుప్పంh పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నందు సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల పరికరాల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెపిఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డాక్టర్ సురేష్ బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన పరికరాలను అందించడానికి ఎంపిక కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సర్వ శిక్ష అభియాన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో ఎంపిక కాబడిన వారికి అవసరమైన పరికరాలను ఆలింకో సంస్థ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుందన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విభిన్న ప్రతిభావంతులు జననాయకుడు కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రికి తమ పరిస్థితులను విన్నవించుకోవడం జరిగిందన్నారు. ఇది గుర్తించిన ముఖ్యమంత్రి మూడు చక్రాల వాహనాలను, వినికిడి యంత్రాలను విభిన్న ప్రతిభావంతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నేటి శిబిరంలో నియోజకవర్గ పరిధిలో సుమారు 150 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారని, వీరందరిని పరీక్షించి వారికి అవసరమైన యంత్రాలను అలింకో సంస్థ ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ టిడిపి విస్తరణ విభాగ కమిటీ సభ్యులు, 11వ క్లస్టర్ ఇంచార్జి కన్నన్, టిడిపి విస్తరణ విభాగం కమిటీ సభ్యులు బెండన కుప్పం బాబు, రాజారామ్, రెస్కో డైరెక్టర్ ఆర్ముగం, మండల టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.
