

మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-30:చిత్తూరు–అరగొండ రహదారిపై తవణంపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. గంగవరం మండలం కీళపట్ల గ్రామానికి చెందిన టి. మునీంద్ర తన నాన్నమ్మ టి. నారాయణమ్మ (వయసు 74, భర్త స్వర్గస్తుడు టి. మునిరత్నం)ను మోటార్ సైకిల్‌పై వెనుక కూర్చోబెట్టి కాణిపాకం గుడి దర్శనార్థం బయలుదేరాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తవణంపల్లి గ్రామంలోని రాజా ఫోటో స్టూడియో సమీపానికి చేరుకున్న సమయంలో, ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు (నంబరు : ఏపీ 29 జెడ్ 1766) డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కుడివైపు మధ్యభాగం నారాయణమ్మ భుజానికి తగలడంతో ఆమె రోడ్డు మీద పడిపోయారు. వెంటనే బస్సు వెనుక చక్రం ఆమె తలపై వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న తవణంపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. టి. మునీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.