

మన న్యూస్, తిరుపతి,మార్చి 15 :- సంపూర్ణ విద్యతోనే అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సుసాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ప్రభుత్వ గిరిజన సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని పదవ తరగతి విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పరీక్షల సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు రేపటి నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న సందర్భంగా వారికి మానవతాచే ఉచితంగా జామెంట్రీ బాక్స్, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, ప్యాడ్డు తదితర వస్తువులను ఎంఈఓ లు ఇందిరాదేవి, రంగనాథ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారితో పాటు ప్రిన్సిపాల్ హరిబాబు, మానవతా ప్రతినిధులు భార్గవ, మాధవ నాయుడు, సుకుమార్ రాజు, వేణుగోపాల్, పద్మనాభం తదితరులు మాట్లాడుతూ చిన్నతనం నుంచే సేవా దృక్పథంతో మెలగాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ప్రతి విద్యార్థి అభివృద్ధి సుసాధ్యమన్నారు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించి విద్యా ప్రగతి చెంది కన్న తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలన్నారు. పరీక్షలు ఎలా రాయాలో అవగాహన కల్పించారు. మానవతా సేవా సంస్థ సేవలను సోదాహరణంగా వివరించారు. 550 పైగా మార్కులు తెచ్చుకున్న ప్రతి విద్యార్థికి మానవతాచే నగదు బహుమతిని అందజేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. విద్యార్థి దశ నుంచి ఐకమత్యంతో కుల, మత, వర్ణ,వర్గ విభేదాలు లేకుండా సోదర భావంతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తో పాటు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
