గణాంకాలతో టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వానికి కుప్పాల గిరిధర్ కుమార్ విజ్ఞప్తి
తిరుపతి, మనద్యాస, నవంబర్-25: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల, తిరుపతి స్థానిక భక్తులకు ప్రత్యేక దర్శన కోటా కేటాయించాలని కుప్పాల గిరిధర్ కుమార్ టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కుప్పాల గిరిధర్ కుమార్ మాట్లాడుతూ.. టీటీడీ చరిత్రలో గతంలో వైకుంఠ ఏకాదశి ఒక్కరోజే 1,05,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే గత ఏడాది డిసెంబర్ 30, 2025న వైకుంఠ ఏకాదశి రోజున 62,000 మందికి, ద్వాదశి రోజున 65,000 మందికి మాత్రమే దర్శనం కల్పించారని పేర్కొన్నారు. గత రికార్డులతో పోలిస్తే ఏకాదశి, ద్వాదశి రోజుల్లో కలిపి సుమారు 80,000 మందికి పైగా భక్తుల దర్శన సంఖ్య తగ్గిందని తెలిపారు. దర్శనాల సంఖ్యను తగ్గించి రద్దీ నియంత్రణలో సమర్థత సాధించామని చెప్పుకోవడం కంటే, గత రికార్డులను అధిగమిస్తూ ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడమే నిజమైన సమర్థత అని అభిప్రాయపడ్డారు. తిరుమల మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా ఎంతోమంది స్థానికులు తమ స్థలాలను, ఆస్తులను శ్రీవారి సేవ కోసం త్యాగం చేశారని గుర్తుచేశారు. తిరుమల, తిరుపతి ప్రాంత ప్రజలు కూడా శ్రీవారి పరమ భక్తులేనని, వారికి వైకుంఠ ద్వార దర్శనంలో ప్రాధాన్యత కల్పించడం టీటీడీ బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో ఉన్న 1.05 లక్షల దర్శన సామర్థ్యాన్ని పునరుద్ధరించి, అదనంగా అందుబాటులోకి వచ్చే 30 వేల నుంచి 40 వేల దర్శన టికెట్లను వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు కేటాయించాలని కోరారు. స్థానిక భక్తుల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ విధానంలో లేదా ప్రత్యేక కౌంటర్ల ద్వారా దర్శన టోకెన్లు జారీ చేసే విధానాన్ని వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాప్రతినిధులు స్పందించాలి:
ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, టీటీడీ ప్రత్యేక పాలక మండలి, కార్యనిర్వహణాధికారి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు, తిరుపతి మేయర్ జె.బి. శ్రీనివాస్, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని కోరారు. స్థానిక భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో ప్రత్యేక దర్శన కోటా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కుప్పాల గిరిధర్ కుమార్ విజ్ఞప్తి చేశారు.