

మన న్యూస్: పాచిపెంట, డిసెంబర్ 13 రెండు రాష్ట్రాల మధ్య గిరిజన బతుకులు చితికి పోతున్నాయి? ఆందోళన చెందుతున్న సరిహద్దు గిరిజనులు పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వీరి జీవనం దుర్భరం. సరైన వైద్యం అందక, వైద్య సిబ్బంది కానీ అధికారులు గానీ పర్యటించక ఆంధ్రా-ఒడిస్సా రాష్ట్రాల మధ్య బంగారుగుడ్డి గిరిజన గ్రామ ప్రజలు నరకం అనుభవిస్తున్నారని గ్రామ పెద్దలు గెమ్మెల అప్పారావు తదితరులు ఆవేదన చెందుతున్నారు. మా బ్రతుకులు మారేదెప్పుడని వారంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దుర్భరమైన జీవనం సాగిస్తున్నారు. మండల అధికారులు పర్యవేక్షణ లేక ఆయా గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందం లా తయారయ్యింది. నిత్యవసర సరుకులు కోసం మైళ్ళ దూరం నడవలసి వస్తుందని రేషన్ డిపో ఏర్పాటు చేయాలని గెమ్మెల అప్పారావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వైద్యం కోసం మైదాన ప్రాంతం వెళ్ళాలి.వెళ్తే చేతిలో డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.ఈ గిరిజన ప్రజలంతా మైదాన ప్రాంతాలకు అందనంత దూరంలో ఉన్నారు. ప్రభుత్వాలు మారినా వారి బ్రతుకులు మారలేదు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి సంధ్యారాణి ని కలసి మా బాధలు చెప్పుకోవడానికి వెళ్తామని అనుకున్నప్పటికీ వెళ్లలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. పాచిపెంట మండలం మోదుగ పంచాయతీలో గల బంగారు గుడ్డి, లోవ, బంద వలస,ఇప్పపాడు, మూల పాడు, దారిం పాడు, కాట్రాగుడ్డి గ్రామాలు ఆంధ్రా.. ఒడిస్సా రాష్ట్రాల మధ్య వున్నాయి. ఈ గ్రామాల ప్రజలు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. రేషన్ సరుకులు కోసం బట్నాయక వలస రావాలి. నిత్యవసర సరుకులు కోసం 20 కిలోమీటర్లు దూరం లో వున్న పాచిపెంట రావాలి. గ్రామాల్లో వీధిలైట్లు లేక చీకట్లో విష సర్పాలు మధ్య భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. సొంతంగా భూములు లేవు. ప్రభుత్వాలు కనీసం డి పట్టా భూములు కూడా మంజూరు చేయలేదు. బ్రతుకుతెరువు కోసం అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పోడు భూములు వ్యవసాయం చేసుకుంటే ఇటీవల సిక్స్ లైన్స్ రహదారి నిర్మాణం పనుల్లో ఆ భూములు కోల్పోయామని జీవనో పాధి లేక నరకం ఆనువభిస్తున్నామని గ్రామ పెద్దలు గెమ్మల బాబురావు, అప్పారావు, మామిడి చిన్నారావు,మల్లయ్య, సీతయ్య, అప్పన్న ఆందోళన వ్యక్తం చేశారు.రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆంధ్రా అభివృద్ధి చేస్తారని వాళ్ళు వదిలేసారు. వీళ్ళు చేస్తారు లే.. అంటూ ఆంధ్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడం మానుకుందని ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో కరెంటు లేక పంచాయతీ లైట్లు వెలగక విష సర్పాలు గ్రామంలోకి వచ్చి ప్రాణ భయం కల్పిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. గతంలో మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని మాయ మాటలు చెప్పి మమ్మల్ని దోచుకుంటున్నారు తప్ప.. మా అభివృద్ధికి ఏ ఒక్కరూ పాటుపడడం లేదని అప్పారావు చెబుతున్నారు. బంగారు గుడ్డి గిరిజన గ్రామంలో 35 కుటుంబాలు ఉన్నాయని 120 మంది జనాభా ఉండగా ప్రభుత్వం చిన్న పిల్లలు చదువు కోసం స్కూల్ నిర్మాణం చేపట్టలేదని అంటున్నారు. ఒడిస్సా ప్రభుత్వం స్కూలు నిర్మాణం చేపట్టినప్పటికీ ఉపాధ్యాయులు లేక పిల్లలు బడికి వెళ్లక విద్యాభివృద్ధి కుంటుపడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 35 కుటుంబాలకు గాను ఆంధ్ర ప్రభుత్వం 20 ఇల్లులు మంజూరు చేయగా ఒడిస్సా ప్రభుత్వం ఇల్లులు మంజూరు చేయలేదని చెబుతున్నారు. అలాగే వేగావతి నదిపై బుచ్చుంపాడు. బంగారు బుడ్డి గ్రామాల మధ్య వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. మా అభివృద్ధిని మోదుగ పంచాయతీ సర్పంచ్ పట్టించుకోవడంలేదని, కాలువల్లో పూడికలు తీయడం లేదని, లైట్లు వేయడం లేదని వారంతా ఆరోపిస్తున్నారు. మా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి మా బ్రతుకులు మారే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అలాగే కాట్రగుడ్డి గిరిజన గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని సూకురు అప్పన్న, చిన్నయ్య, పోతన్న, తామల రామన్న తెలిపారు.పంచాయతీ సర్పంచ్ పట్టించుకోరని తెలిపారు. వేగవతి నదిలో ఇన్ ఫిల్టర్ వాల్ నిర్మించడంతో వరదలు వస్తే ఆ వాల్ వాగులో కొట్టుకుపోతుందని, అలా జరిగితే త్రాగునీరుకి చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము సాగు చేస్తున్న భూములకు డీ పట్టాలు ఇవ్వాలని ఈ మధ్యకాలంలో జరగబోయే రెవెన్యూ సదస్సుల్లో రెవిన్యూ శాఖ మాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నారు. మా బతుకులు రెండు రాష్ట్రాల మధ్య చితికి పోతున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి సంధ్యారాణి చొరవ తీసుకొని మా సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.