

మన న్యూస్: పాచిపెంట, డిసెంబర్ 13: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏజెన్సీలో తాము సాగు చేస్తున్న భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కేరంగి సర్పంచ్ సోముల లచ్చయ్య తదితరులు రెవెన్యూ సదస్సులో కోరారు. శుక్రవారం నాడు పూడి గ్రామం వద్ద పాచిపెంట మండల తాసిల్దార్ డి రవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో ఏజెన్సీ సమస్యలపై ఐదు పంచాయతీలు సర్పంచులు సమస్యలతో కూడుకున్న మెమోరండం అందించారు. వారి సమస్యలు ఇలా వున్నాయి. కొండమోసూరు పంచాయతీలో 1600 ఎకరాలు సర్వే జరపాలని కోరారు.అలాగే కేరంగి రెవెన్యూ పరిధిలో 800 ఎకరాలు సర్వే జరపాలని కోరారు.అలాగే మిలియా కంచూరు, తుమరావల్లి పంచాయతీ పరిది గిరిజన గ్రామాల్లో 2000 ఎకరాలు సర్వే జరపాలని కోరారు. అలాగే అటవీ భూములు సాగు చేస్తున్నాము వాటికి సంబంధించిన పట్టాలు ఇవ్వాలని కోరారు. ఏజెన్సీలో రహదారులు నిర్మించాలని కోరారు. కొత్త రేషన్ కార్డులు కోసం చాలా మంది దరఖాస్తులు చేసారు. వారు అందించిన వినతి పత్రం క్షుణ్ణంగా చదివిన తాసిల్దారు రవి మీ సమస్యలపై జిల్లా కలెక్టర్కు నివేదిక తయారు చేసి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. అర్హులు కు రేషన్ కార్డులు వచ్చే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు. సర్పంచ్ సోములు లచ్చయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ మా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందలేదని మా సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వడం లేదని మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని తమరు వెంటనే స్పందించి మాకు పట్టాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.