మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా పరిదిలోని మక్తల్ పట్టణ కేంద్రంలోని వైష్ణవీ మహిళల జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ఏసీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ, భారతదేశ రాజ్యాంగం ప్రతి భారత పౌరునికి కనీస మానవ హక్కులను కల్పించిందని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం రాక ముందు కనీస హక్కులు ఉండేవి కావని, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగం హక్కులను కల్పించిందని అన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనను 1948 డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిందని, ప్రతి ఏటా డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీరామ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ రావు, సెక్రటరీ సూర్య ఆంజనేయులు, కట్టా వెంకటేష్, శ్రీనివాస్, మామిళ్ల పృథ్వీరాజ్, సాధిక్, అరుణ స్వప్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






