చిత్తూరు, మన ద్యాస నవంబర్-28: చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి 135వ వర్ధంతి సందర్భంగా ఎస్‌టియు చిత్తూరు జిల్లా శాఖ తరఫున పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఎస్‌టియు రాష్ట్ర సహాధ్యక్షులు గంట మోహన్ మాట్లాడుతూ, “బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య అందించేందుకు తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు జ్యోతిరావు పూలే. ముఖ్యంగా మహిళలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి అపూర్వం. కులవ్యవస్థ నిర్మూలనకు, సామాజిక అసమానతల తొలగింపుకు ఆయన పోరాటం చేసిన తీరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన ఆలోచనలు ఈ తరానికి, భవిష్యత్ తరాలకు శాశ్వత మార్గదర్శకం” అని అన్నారు. అదే విధంగా ఎస్‌టియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “అణగారిన వర్గాల అభ్యున్నతికై పూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి. పూలే ఆశయాలే యువతకు లక్ష్యంగా ఉండాలి. విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని ఆయన గాఢంగా నమ్మారు. ఆయన స్ఫూర్తితో ప్రతి యువకుడు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టియు రాష్ట్ర కమిటీ కన్వీనర్లు పురుషోత్తం, దేవరాజులు రెడ్డి, చిత్తూరు విభాగ సమన్వయకర్త ఢిల్లీ ప్రకాశ్, అలాగే గుణశేఖరన్, సుబ్రహ్మణ్యం పిళ్ళై, రంగనాథం, పెద్దబ్బరెడ్డి, ప్రహసిత్, వెంకటేశ్వర రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.







