యాదమరి, మన ధ్యాస సెప్టెంబర్ 4 :
చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వరిగపల్లి, యాదమరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)గా పనిచేస్తున్న మీనాక్షి, చెర్లోపల్లి, చిత్తూరు రూరల్ మండలం మోడల్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాధా కుమారి ఈ అవార్డుకు ఎంపికైనారు. గత 20 సంవత్సరాలుగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న మీనాక్షి, అనేకమంది విద్యార్థులను చదువుతోపాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. రిసోర్స్ పర్సన్‌గా ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలలో పాల్గొని విద్యా రంగంలో విశేష కృషి చేశారు. విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, దేశభక్తి పెంపొందించే విధంగా బోధించడం ఆమె ప్రత్యేకత. రాధా కుమారి, సెకండరీ గ్రేడ్ టీచర్‌గా మోడల్ ప్రాథమిక పాఠశాల, చెర్లోపల్లిలో తన బోధనతో విద్యార్థులను ప్రేరేపిస్తూ, వారిలో విద్యాసక్తిని పెంపొందించడంలో విశేష పాత్ర పోషించారు. చిన్నారులలో విద్యాపై ఆసక్తిని కలిగించేందుకు అనేక వినూత్న బోధనా పద్ధతులను అమలు చేశారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయుల అంకితభావాన్ని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన చిత్తూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరగబోయే ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వీరు తమ ప్రతిష్టాత్మక అవార్డులను స్వీకరించనున్నారు.








