

గూడూరు, మన న్యూస్ :- నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని తిరుపతి జిల్లా సిపిఐ కార్యదర్శి మురళి పేర్కొన్నారు.సిపిఐ ఆధ్వర్యంలో రెట్టపల్లి గ్రామంలో జరిగిన మండల ద్వితీయ మహాసభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరు మండలంలోని రెట్ట పల్లి గ్రామంలో సోమవారం చిల్లకూరు మండల ద్వితీయ మహాసభ కార్యక్రమం వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి జిల్లా సిపిఐ కార్యదర్శి మురళి మాట్లాడుతూ… ఎన్ని ప్రభుత్వాలు మారిన ప్రజల సమస్యలను ఎవ్వరూ పట్టించుకోవడంలేదని, పేద,బడుగు,బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడే ఏకైక పార్టీ సిపిఐ అని, కూటమి ప్రభుత్వ నాయకులు పేదవారి సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్నారని, పెత్తందార్ల చేతుల్లో ఉన్న నక్కల వారి కండ్రిగ భూములను పేదలకు మంచి ఇవ్వాలని,మండలంలో నెలకొని ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజానాట్యమండలి సభ్యులు విప్లవ గీతాలను ఆలపించారు.ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చిన్న పెంచలయ్య, గూడూరు సిపిఐ కార్యదర్శి ఎస్ కుమార్, రైతు సంఘం జిల్లా నాయకులు సివిఆర్ కుమార్, ఏఐటీయూసీ గూడూరు ప్రధాన కార్యదర్శి నారాయణ, చిల్లకూరు మండలం కార్యదర్శి రమేష్ బాబు, నేలపల్లి-రెట్టపల్లి శాఖ కార్యదర్శి చెన్నూరు రాఘవయ్య, తలారి మస్తానయ్య, సిపిఎం నాయకులు ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు.
