గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 14: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల: చికిత్స కోసం వెళ్తే మూడు నెలల పసిపాప మృత్యు ఒడిలోకి చేరింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట శుక్రవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరూర్ మండలం రేవులపల్లి గ్రామానికి చెందిన ఆనంద్, అశ్విని దంపతుల మూడు నెలల పాపకు జ్వరం కారణంగా ఈ నెల 11న గద్వాల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వెంటనే కర్నూల్లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు రెఫర్ చేసి, వారే అంబులెన్స్ ఏర్పాటుచేసి పంపించారు. అక్కడికి చేరుకోగానే వైద్యులు పరీక్షించి పాప మృతి చెందినట్లు నిర్ధరించారు. అయితే గద్వాల నుంచి వెళ్లేటప్పుడే చిన్నారిలో చలనంలేదని, ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *