

మన న్యూస్ తవణంపల్లె జూన్-11
పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, ఏ.గొల్లపల్లి గ్రామంలోని దళితవాడలో దాదాపు 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాల లభ్యత కల్పించేందుకు చేపట్టిన చర్యలు ఫలవంతం అయ్యాయి. బుధవారం జరిగిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 47 మంది లబ్దిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఏ.గొల్లపల్లె దళితవాడలో స్థిర నివాసం ఉన్నప్పటికి పట్టాల లభ్యత లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్ధానిక శాసనసభ్యులు డా. మురళీమోహన్ గుర్తించి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందనతో నెల రోజుల వ్యవధిలోనే అన్ని అనుమతులు పొందుతూ పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టారు. లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ క్షేమానికై కృషి చేసిన ఎమ్మెల్యేకు, కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కె. మురళీమోహన్ మాట్లాడుతూ… “పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం అని, సంవత్సరాలుగా పట్టాల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు న్యాయం జరగడం ఎంతో సంతృప్తికరంగా ఉందన్నారు. ఇళ్ళ పట్టాలు లేకుండా ఉన్న వారు ఎవరైన తమ సమస్యలు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే ప్రభుత్వం తరఫున నేను పూర్తి సహకారంతో ఉంటాను” అని పేర్కొన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడంపై కూడా తన కృషిని కొనసాగిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లి తహసిల్దార్ సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లె క్లస్టర్ ఇంఛార్జ్స్ మోహన్ నాయుడు, సునీల్ చౌదరి, బంగారుపాళ్యం మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, ఏ.గొల్లపల్లె సర్పంచ్ ప్రవీణ్, టిడిపి నాయకులు పట్నం గోపి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గోన్నారు.
