సంజీవరాయ పర్వతం – హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆధ్యాత్మిక క్షేత్రం

మన న్యూస్, రాయలచెరువు:
రామచంద్రపురం మండలం రాయలచెరువు కట్ట దిగుభాగంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో ఆలయం హరివిల్లు వలె కళకళలాడింది. ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదానాలతో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. తిరుమల శ్రీవారి సప్తగిరులకు దక్షిణంగా, కూతవేటు దూరంలో ఉన్న సంజీవరాయ పర్వతం దిగువన వెలసిన ఈ ఆలయం, దేశంలోనే తక్కువగా దర్శనమిచ్చే చతుర్భుజ ఆంజనేయ స్వామి స్వయంభూ రూపంతో ప్రత్యేకతను సంతరించుకుంది. త్రేతాయుగంలోనే యోగాసనంలో స్వయంగా వెలసిన ఈ స్వామి సూర్యచంద్రులతో సాక్షిగా ప్రత్యక్షమయ్యారని స్థలపురాణం చెబుతోంది.

ఈ ప్రాంతం హనుమంతుని బాల్య ఆడస్థలంగా భావించబడుతోంది. తిరుమల శిఖరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకారం కనబడినట్టే, ఇక్కడ గుండులో స్వామివారి ఆకృతి దర్శనమిస్తుంది. పర్వతం వద్ద ఉన్న పుష్కరిణిలో ఎన్నో యుగాలుగా నీరు ఎండకుండానే ప్రవహిస్తుండటం విశేషం. స్థానిక ప్రాచీన కధనం ప్రకారం, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ స్వామి వెలుగులోకి వచ్చారు. చెరువు కట్ట నిర్మాణంలో విఫలమవుతూ ఉండగా, రాయలవారికి స్వప్నంలో స్వామి దర్శనమిచ్చినట్టు చెబుతారు. అప్పటినుంచి ఈ ఆలయానికి భక్తుల నిత్యరాకపోకలు మొదలయ్యాయి.

ఇంకొక ఆసక్తికరమైన కధనం ప్రకారం, చెరువు కట్ట నిలబడకపోవడంతో రాయలవారు తమ చెల్లెలు రాయలమ్మను బలిగా ఇచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆమె విగ్రహం ఒక కాలంలో మాట్లాడేదని కూడా కథలుగా వినిపిస్తుంటాయి. 2021 వరదల సమయంలో చెరువు కట్ట తెగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందగా, తరువాత AFCON సంస్థ ఆధ్వర్యంలో రాయలమ్మను తిరిగి ప్రతిష్టించారు.

ఆలయ అభివృద్ధి
2007లో గంగిరెడ్డిపల్లెకు చెందిన భక్తుడు ఆలయాన్ని విస్తరించి విజయ గణపతి, మహాలక్ష్మి, బాలసుబ్రమణ్య స్వామి తదితర దేవతలను ప్రతిష్టించారు. 2010లో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్న అనంతరం శివ సంకల్పంతో కోటిలింగేశ్వర స్వామి సహా 108 శివలింగాలను గర్భాలయంలో ప్రతిష్టించారు. అదనంగా కామాక్షి అమ్మవారిని ప్రతిష్ఠించి, యాగశాలను నిర్మించి హోమాలు నిర్వహిస్తున్నారు.ఈ క్షేత్రం శివకేశవ క్షేత్రంగా విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ జయంతి, శివరాత్రి, కార్తీక దీపం, ఉగాది, వినాయక చవితి తదితర పర్వదినాల్లో ఇక్కడ విశేష పూజలు, హోమాలు, అన్నదానం నిర్వహించబడుతున్నాయి. ఈ విధంగా సంజీవరాయ పర్వతం ప్రాంతం ఒక అద్వితీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా మారింది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ స్థలం, ఇంకా అనేక రహస్యాలను తన భూగర్భంలో దాచుకుని ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *