న్యాయవాద వృత్తి నిరంతర అధ్యయనం – సామాన్యులకు న్యాయం అందించడమే లక్ష్యం కావాలి
న్యాయ విద్యార్థులకు, యువ అడ్వకేట్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం:డా. డాలర్స్ దివాకర్ రెడ్డి.
అనంత కాలేజీ ఆఫ్ లా వారి కాలేజీ వార్షికోత్సవ కార్యక్రమంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ప్రస్తుతం చాలామంది ఇంజనీరింగ్,మెడిసిన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నప్పటికీ, సమాజంలో మంచి అడ్వకేట్‌గా స్థిరపడాలనే లక్ష్యంతో న్యాయ విద్యను ఎంచుకున్న విద్యార్థులను ఆయన అభినందించారు.న్యాయ విద్య కేవలం ఒక కోర్సు కాదని, జీవితాంతం కొనసాగించే అధ్యయనమని పేర్కొన్నారు.చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు ఎప్పటికప్పుడు మారుతుంటాయని, అందువల్ల న్యాయవాదులు నిరంతరం అధ్యయనం చేస్తూ తమ జ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, క్రమశిక్షణతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు..తిరుపతి జిల్లాలో కోర్టు నిర్మాణాన్ని తుడా ఆధ్వర్యంలో అత్యంత వేగంగా పూర్తి చేసిన విషయాన్ని డా. డాలర్స్ దివాకర్ రెడ్డి గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన సందర్భంగా కేవలం 15 రోజుల్లో రాత్రింబవళ్లు శ్రమించి అవసరమైన పనులను పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు.ఈ పనులను అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశంసించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.న్యాయ విద్యార్థులు, యువ అడ్వకేట్లకు తుడా పరంగా, వ్యక్తిగతంగా తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని డా. డాలర్స్ దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.విద్యార్థులు భవిష్యత్తులో మంచి న్యాయవాదులుగా ఎదిగి, సామాన్య ప్రజలకు న్యాయం అందుబాటులోకి తీసుకురావాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అనంత లా కాలేజ్ స్టూడెంట్స్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.