

మన న్యూస్,తిరుపతి :- రాష్ట్రంలోని 35 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా మార్చే విధానాలను నిరసిస్తూ సిపిఎస్ ఉద్యోగులారా ఏకంకండి నినాదంతో చైతన్య యాత్రను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చీర్ల కిరణ్ తెలిపారు. గురువారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ చైతన్య యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో భాగంగా తిరుపతి చిత్తూరు అనంతపురం అన్నమయ్య, హిందూపురం, నంద్యాల కర్నూల్ జిల్లాల కలెక్టర్లను కలసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సిపిఎస్ పథకం అమలు చేసిన నాటి నుండి ఇప్పటివరకు ఎన్నో సమస్యల కుప్పలు తిప్పలుగా పడి ఉన్నాయని వాటిని పరిష్కరించిన దాఖలాలు అయితే లేవని చెప్పారు. అనంతరం చైతన్య యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పవన్, రామాంజనేయులు యాదవ్, రాజేశ్వరరావు, నరసింహ, లక్ష్మీపతి, ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.