

Mana News :- ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఇంగ్లీష్ మీడియంలో 5.64 లక్షల మంది విద్యార్ధులు, తెలుగు మీడియంలో 51 వేల మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయబోతున్నారు.ఏడు పేపర్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకూ ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ పరీక్షలు ఉంటాయి.ఈసారి పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు విద్యాశాఖ మంత్రి ఎక్స్ ద్వారా ఓ మెసేజ్ పంపారు. ఇందులో ఆయన పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఎటువంటి ఒత్తిడికి గురికావద్దని విద్యార్ధులకు మంత్రి లోకేష్ సూచించారు.ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇది అని లోకేష్ వారికి తెలిపారు. ప్రశాంతంగా ఉండాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్ష పూర్తి చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చివర్లో విజయీభవ అంటూ తన మెసేజ్ ను లోకేష్ ముగించారు.
