మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మక్తల్ నియోజకవర్గాన్ని ఒక విద్యా హబ్ గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర క్రీడా,పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణ పేట జిల్లా మాగనూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీధర్ రెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ,ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని, భావి భారత పౌరులను సక్రమ మార్గం లో తీర్చి దిద్దేది ఒక్క ఉపాధ్యాయుడే అని అన్నారు. మీ తల రాతను మార్చే శక్తి విద్య ఒక్కటే అని అభిప్రాయపడ్డారు.అబ్దుల్ కలాం చెప్పిన విధంగా కలలు కని వాటిని సాకారం చేసే దిశగా విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రయివేటు బడుల కన్నా ప్రభుత్వ బడి లోనే నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వ బడుల్లో చదివిన వారే ఎక్కువగా సివిల్స్ కు ఎంపికవుతున్నారని తెలిపారు. మక్తల్ లో 230 కోట్ల తో 25 ఎకరాలల్లో త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్రారంభం అవుతుందని వెల్లడించారు. విద్య, జ్ఞానం ఎవ్వరిసొత్తు కాదని , కష్టపడి చదివితే అది అందరి సొంతం అవుతుందని పేర్కొన్నారు. కష్టపడకుండా ఏదీ రాదని , కష్టపడ కుండా వచ్చింది ఎల్ల కాలం నిలవదని హితవు పలికారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందని మంత్రి గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మాగనూరు సర్పంచ్ దండు జనార్దనమ్మ, స్కూల్ చైర్మన్ ఇందిరమ్మ, పాఠశాల బృందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *