

Mana News :- అఖిల భారత స్థాయి సర్వీసుల్లో అధికారుల ఎంపిక కోసం ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచారు. గతేడాది నిర్వహించిన యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్షలో ఎంపికైన 1009 మంది అభ్యర్ధుల పేర్లను వెబ్ సైట్ లలో పీడీఎఫ్ రూపంలో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి పలు ప్రతిష్టాత్మక కేంద్ర సర్వీసుల్లో ఎంపిక కోసం నిర్వహించే సీఎస్ఈ పరీక్షలో భాగంగా 1056 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 1009 మంది మాత్రమే తుది జాబితాకు ఎంపికయ్యారు. వీరి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. లో అందుబాటులో ఉంచారు. వీరికి మెరిట్ ఆధారంగా వివిధ అఖిల భారత సర్వీసుల్లో నేరుగా అపాయింట్ మెంట్లు లభించబోతున్నాయి. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. గతేడాది జూన్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. సెప్టెంబర్ 20-29 వరకూ మెయిన్స్ నిర్వహించారు. అలాగే ఈ ఏడాది జనవరి 7 నుంచి 17వ తేదీ వరకూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో అఖిల భారత స్ధాయిలో టాపర్ గా శక్తి దూబే నిలిచారు. హర్షిత గోయల్ కు రెండో ర్యాంక్ లభించింది. తెలుగు అభ్యర్ధి సాయి శివానికి 11వ ర్యాంక్ దక్కింది. యూపీఎస్సీ క్యాంపస్‌లోని పరీక్షా హాల్ దగ్గర ఫెసిలిటేషన్ కౌంటర్ అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ పరీక్షలు లేదా నియామకాలకు సంబంధించిన ఏదైనా సమాచారం లేదా స్పష్టతను పని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య స్వయంగా లేదా 23385271, 23381125 మరియు 23098543 నంబర్లలో టెలిఫోన్ నంబర్ ద్వారా పొందవచ్చు.ఫలితాలు ప్రకటించిన తేదీ నుండి 15 రోజుల్లోపు మార్కులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని యూపీఎస్సీ తెలిపింది.