

Mana News :- వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నలుగురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్‌సీకి గుడ్ బై చెప్పారు.తాజాగా రాజశేఖర్ రాజీనామాతో ఈ సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే పోతుల సునీత, బల్లి కళ్యాణచక్రవర్తి,కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత 2010లో ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 2014లో చిలకలూరిపేట నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో వైఎస్ జగన్ పాదయాత్రలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2023 మార్చిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ తరపున ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి ఆయన వైఎస్ఆర్‌సీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ, ఆయనకు పార్టీ నాయకత్వం టికెట్ కేటాయించలేదు.
