

Mana News, అమరావతి: విశాఖపట్నంలోని భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మాణం చేపట్టడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.విజయసాయి కుమార్తె నేహా రెడ్డి వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీపైనా న్యాయస్థానం మండిపడింది. కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించిన న్యాయమూర్తి.. అలా చేస్తేనే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని పేర్కొన్నారు.బీచ్‌లో గోడ తొలగించి ఆరు అడుగుల పునాదిని అలాగే వదిలేయడం సరికాదు. గోడ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలి. గోడ కూల్చివేత ఖర్చు, పర్యావరణ నష్టం నేహా రెడ్డి కంపెనీ నుంచి రాబట్టాలి అని న్యాయమూర్తి ఆదేశించారు. భీమిలి వద్ద 4 రెస్ట్రో బార్ల అక్రమ నిర్వహణపై దాఖలైన పిల్ పైనా హైకోర్టులో విచారణ జరిగింది. రెస్ట్రో బార్లపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం మూడు వారాలకు వాయిదా వేసింది.