తిరుపతి, మనద్యాస, అక్టోబర్-10: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడ వీధుల్లో స్థానికులకు ప్రత్యేక గ్యాలరీలు కేటాయించాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ టీటీడీ బోర్డు, అధికారులను కోరారు. తరతరాలుగా తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు శ్రీవారి ఉత్సవాల్లో భాగస్వాములై సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. పూర్వకాలంలో స్థానికులు శ్రీవారి నైవేద్యానికి అవసరమైన పాలు, పెరుగు, బియ్యం, పప్పులు, నూనె, చింతపండు, కూరగాయలు తదితర వస్తువులను కొండపైకి తీసుకెళ్లి సమర్పించేవారని తెలిపారు. టీటీడీ నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభానికి ముందు, స్వర్గీయ ఎన్టీఆర్ అన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టకముందు కూడా స్థానికులు తమ ఇళ్లలో అన్నప్రసాదాలు తయారు చేసి బ్రహ్మోత్సవాల సమయంలో వేలాది మంది భక్తులకు పంపిణీ చేసేవారని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడ వీధులను శుభ్రం చేయడం, రంగవల్లులు వేయడం, స్వామివారికి హారతులు ఇవ్వడం, కోలాటాలు ఆడటం వంటి సేవల్లో స్థానికులు కీలక పాత్ర పోషించేవారని గుర్తుచేశారు. స్థానికులకు, శ్రీవారి ఉత్సవాలకు మధ్య ఉన్న చారిత్రక అనుబంధాన్ని, వారి సేవలను టీటీడీ గుర్తించాలని కోరారు. మాడ వీధుల్లో ఉన్న మొత్తం 190 గ్యాలరీల్లో కనీసం 25 నుంచి 30 గ్యాలరీలను స్థానికులకు ప్రత్యేకంగా కేటాయించాలని, ఆధార్ కార్డు ఆధారంగా స్థానికులను గుర్తించి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుమల స్థానికులు స్వామివారికి హారతి సమర్పించేందుకు మేదరమెట్ట వైపు తదితర ప్రాంతాల్లో నాలుగు ప్రత్యేక హారతి పాయింట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశంపై టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, అదనపు ఈవోతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి తగిన నిర్ణయం తీసుకోవాలని కుప్పాల గిరిధర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. స్థానికులకు ప్రత్యేక గ్యాలరీలు కేటాయించడం వారి సేవలకు గుర్తింపునివ్వడంతో పాటు ఆత్మగౌరవాన్ని గౌరవించినట్లవుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *