ప్రజాశాంతికి భంగం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ..ఇన్‌స్పెక్టర్ ఎస్. జయచంద్ర కోరారు.

​
​రేణిగుంట, నవంబర్ 23.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ వ్యక్తికి రేణిగుంట తహసీల్దార్ రూ.2 లక్షల భారీ జరిమానా విధించినట్లు రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. జయచంద్ర తెలిపారు.
​తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఎస్. జయచంద్ర, ఎస్‌ఐ వై. శ్రీనివాసులు నేర నియంత్రణలో భాగంగా పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు. రేణిగుంట మండలం, కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని ఎల్.ఎన్. కండ్రిగ గ్రామానికి చెందిన ధర్మారెడ్డి, నాగరాజు రెడ్డి (47) పై గతంలో రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు పోలీస్ స్టేషన్లలో కోడిపందాలు, పేకాట కేసులు నమోదయ్యాయి.
​అతని ప్రవర్తనలో మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఆగస్టు 22న రేణిగుంట తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశారు. అయితే, నిబంధనలను ఉల్లంఘిస్తూ సెప్టెంబర్ 28న ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలో నాగరాజు రెడ్డి మళ్లీ పేకాట ఆడుతూ పట్టుబడ్డాడు. ఈ ఉల్లంఘన వివరాలను సోమవారం (నవంబర్ 23) ఇన్‌స్పెక్టర్ ఎస్. జయచంద్ర, ఎస్‌ఐ వై. శ్రీనివాసులు రేణిగుంట మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
​విచారణ అనంతరం తహసీల్దార్ అతనికి 14 రోజుల జైలు శిక్ష లేదా రూ.2 లక్షల జరిమానా విధించగా, నిందితుడు జరిమానా మొత్తాన్ని చెల్లించాడు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎస్. జయచంద్ర మాట్లాడుతూ.. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *