చిత్తూరు, మన ధ్యాస జనవరి-5 జిల్లాలో పదవ తరగతి విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన అధ్యయన సామగ్రిని ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్, పూర్వ ఉప జిల్లా విద్యాశాఖ అధికారి చిట్టిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఈ అధ్యయన సామగ్రిని రూపొందించడం అభినందనీయమన్నారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఈ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, మంచి మార్కులు సాధించేందుకు దోహదపడుతుందని పేర్కొంటూ సంఘ నాయకులను అభినందించారు.
చిత్తూరు జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ ఇలియాజ్ మాట్లాడుతూ, పాఠశాల విద్యాశాఖ రూపొందించిన వంద రోజుల కార్యాచరణకు అనుగుణంగా, రాష్ట్ర విద్యా ప్రమాణాల మేరకు సంఘంలోని అనుభవజ్ఞులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఈ అధ్యయన సామగ్రి రూపొందించబడిందని తెలిపారు. తక్కువ సమయంలో విద్యార్థులు పాఠ్యాంశాలను సమగ్రంగా అవగాహన చేసుకొని మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. రాష్ట్ర సీనియర్ నాయకులు గంటా మోహన్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణతో పాటు సమాజం పట్ల బాధ్యతగా విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంలో సంఘం ముందుంటుందని అన్నారు. దాతలైన కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎం వి శ్రీధర్ రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు త్యాగరాజు నాయుడు సహకారంతో సుమారు యాభై వేల రూపాయల విలువైన పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వారి సేవా దృక్పథానికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం దాత త్యాగరాజు నాయుడును జిల్లా విద్యాశాఖ అధికారి శాలువాతో సత్కరించి, విద్యారంగానికి అందిస్తున్న సేవలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవరాజులు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి యువరాజు, జిల్లా ఆర్థిక కార్యదర్శి పురుషోత్తం, జిల్లా మహిళా కార్యదర్శి రాధాకుమారి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆటుకారు చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రన్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి కె గిరిబాబు, యాదమరి మండలం అధ్యక్షులు గుణశేఖరన్, నగిరి డివిజనల్ కన్వీనర్ లక్ష్మీనారాయణతో పాటు పలువురు సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
