మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నారాయణపేట జిల్లాలోని మక్తల్, మాగనూరు, ఉట్కూర్, కృష్ణ, నర్వ మండలాలలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే ఓటింగ్ కి వచ్చే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురావద్దని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు అవసరమైన చోట అదనపు బలగాలను కూడా మోహరిస్తున్నట్లు వెల్లడించారు.పోలింగ్‌కు వచ్చే ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు తీసుకురావద్దని జిల్లా ఎస్పీ స్పష్టంగా సూచించారు. మొదటి విడత, రెండో విడత పోలింగ్‌ల సమయంలో ఓటర్లు సెల్ ఫోన్లు తీసుకురావడం వల్ల వాటిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకపోవడంతో, అత్యవసరంగా బయట ఉన్న వ్యక్తులకు సెల్ ఫోన్లు అప్పగించడం జరిగిందన్నారు. అయితే, ఓటు వేసి వచ్చేవరకు సెల్ ఫోన్ ఇచ్చిన వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో పలు చోట్ల మిస్సింగ్ కేసులు నమోదు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు, మూడో విడత పోలింగ్‌కు వచ్చే ఓటర్లు పోలింగ్ కేంద్రాల పరిధిలోకి సెల్ ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంకు బాటిళ్లు తదితర నిషేధిత వస్తువులు తీసుకురావద్దని జిల్లా ఎస్పీ మరోసారి సూచించారు.అలాగే, ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు అధికారుల సూచనలను పాటిస్తూ, శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా, ఇన్సిడెంట్ ఫ్రీగా పోలింగ్ పూర్తి చేయడమే జిల్లా పోలీసుల లక్ష్యమని ఎస్పీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *