

మన న్యూస్ ఐరాల జులై-10:- కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన మకరధాంభిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శాకాంబరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు శోభాయమానంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మకరధాంభిక అమ్మవారు శాకాంబరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకాంబరి దేవి అమ్మవారిని 20 టన్నుల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారికి విశేషంగా ఆలయ అర్చకులు అలంకరించారు. ఈ పర్వదినం సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పూజా సామగ్రి సమర్పించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక హోమాది కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్నారు. అనంతరం ఆలయ వేద పండితులు ఎమ్మెల్యేకి వేదాశీర్వచనం అందించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర ఆషాఢ పౌర్ణమి సందర్భంగా కాణిపాకం మకరధాంభిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో 20 టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించిన శాకాంబరి దేవి అలంకారాన్ని దర్శించడం నిజంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. శాకాంబరి దేవి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించడం పుణ్యఫలంగా భావిస్తున్నాని, అమ్మవారి ఆశీస్సులతో పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్, పూతలపట్టు నియోజకవర్గం పరిశీలకులు బొమ్మన శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, కాణిపాకం మాజీ ఆలయ ఛైర్మన్ మణినాయుడు, మాజీ జెడ్పీటీసీ లతా బాబునాయుడు, నాయకులు గోపి యాదవ్, మద్దిపాట్లపల్లె చౌదరి, జైకుమార్, సొప్పా నాని తదితరులు పాల్గోన్నారు.

