మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:– కోస్గి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై–2గా విధులు నిర్వహిస్తున్న టి. ఆంజనేయులు నేడు పదవి విరమణ చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించి ఆయన పోలీస్ శాఖకు చేసిన విశిష్ట సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,ఉద్యోగ నిర్వహణలో ప్రతి ఒక్కరికీ పదవి విరమణ తప్పనిసరి ప్రక్రియ అని పేర్కొంటూ, పీసీ స్థాయి నుంచి ఎస్సై వరకు 37 సంవత్సరాల పాటు అంకితభావంతో పోలీస్ శాఖకు సేవలందించిన టి. ఆంజనేయులు సేవలు అభినందనీయమని అన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన పోషించిన పాత్రను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అలాగే పోలీస్ శాఖ నుండి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్‌ను వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కార్యాలయ సూపర్‌డెంట్‌కు ఆదేశించారు. పదవి విరమణ అనంతరం ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పోలీస్ శాఖ పూర్తి అండగా ఉంటుందని, అవసరమైతే నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.టి. ఆంజనేయులు 1987 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరి, అంచలంచలుగా పీసీ, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై హోదాల్లో పదోన్నతులు పొంది, మొత్తం 08 పోలీస్ స్టేషన్లలో 37 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించి, కోస్గి పోలీస్ స్టేషన్ నుండి పదవి విరమణ పొందారు. ఆయనకు భార్య సుభద్ర, ముగ్గురు కుమారులు ఉన్నారని తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ సైదులు, ఆర్‌ఐ నరసింహ, ఎస్‌ఐలు నరేష్, సునీత, సూపర్‌డెంట్ శంకర్ లాల్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.