మన ధ్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు:అక్టోబర్ 20 ://
దీప కాంతులతో శోభాయమానంగా… సంప్రదాయబద్ధంగా నిర్వహించుకొనే పండగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మన భారతదేశంలో చేసుకొనే ప్రతీ పండగకీ ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాము. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారు. రూపాలు మార్చుకొంటూ- తమను ఓడించారనే అక్కసుతో.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి.. ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.








