

మన న్యూస్,తిరుపతి: టీడీపీ మహిళా ఎమ్మెల్యే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వైసిపి నేత ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లడం ఎంతవరకు సమంజసమో ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం సూచించారు. మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ చర్యలను మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయని అందుకే జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను జనం కూడా బహిష్కరించినట్లు వెలవెలపోయిందన్నారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారని వారి రాజకీయ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు. గత వైసిపి ప్రభుత్వంలో మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వకపోగా కూటమి ప్రభుత్వంలో రాజకీయంగా ముందడుగు వేస్తున్న మహిళల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, కించపరిచేలా మాట్లాడిన వైసీపీ నేతలను మందలించడానికి బదులుగా వారిని మరింతగా రెచ్చగొట్టేలా జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందన్న విషయం గుర్తించుకోవాలన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శ పేరుతో నెల్లూరులో పోలీసుల సూచనలను, నిబంధనలను పట్టించుకోకుండా ఓ పోలీసు కానిస్టేబుల్ చెయ్యి విరగడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన కారణమయ్యారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి పాటుపడేలా వ్యవహరించాలని జగన్ మోహన్ రెడ్డికి సూచించారు.