

మన న్యూస్, తిరుపతి, మే 22:- వైశాఖ బహుళ దశమి వీర హనుమాన్ జన్మదిన వేడుకలను ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం పేరిట వీర హనుమాన్ జన్మోత్సవంగా గురువారం శ్రీ రామదూత ఫౌండేషన్ అధ్యక్షుడు, శ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో స్థానిక కపిలతీర్థం కూడలి వద్ద వేడుకగా నిర్వహించడం జరిగినది. ఈ వేడుకలలో భాగంగా వీర హనుమాన్, ఆపరేషన్ సింధూర్ చిత్రపటాలను ఏర్పరిచి వారికి విశేష పూజ, జై బోలో హనుమాన్ కి, జై భారత్ మాత సైన్యానికి అంటూ పెద్ద ఎత్తున హర్ష ధ్వనులతో వారి చిత్రపటాలకు పూల వర్షంతో ఘనంగా పూజించడం జరిగినది. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోలాటం అందరిని విశేషంగా ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా రామదూత సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జరుపుకునే హనుమాన్ జయంతికి ఒక ప్రత్యేకత ఉన్నదని, ఆపరేషన్ సింధూరి పేరిట భారతదేశంతో పోటీపడుతున్న పాక్ సైన్యానికి మన వీర జవాన్లు హనుమంతు డు ఇచ్చిన శక్తి వలె శత్రువుల గుండెల్లో భయభ్రాంతులను నింపారని వారికి అభినందనలు తెలియజేశారు. హనుమంతుడు అంటేనే ఒక ధైర్యం, శక్తి, చిరంజీవుడు అంటూ ఆయనను పూజిస్తే అందరికీ తప్పకుండా ఆయురారోగ్యాలు ప్రసాదింపబడతాయని గుర్తు చేశారు. హనుమంతుడి చరిత్ర, చాలీసా ప్రతి ఒక్కరు పాటిస్తే ప్రతి ఒక్కరి చేత కీర్తింపబడతారని పేర్కొన్నారు. ఎస్ వి ఆయుర్వేద కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ హనుమంతుడు అంటేనే ఒక సింధూరం అని, ఆ సింధూరాన్ని ధరించిన ప్రతి ఒక్కరు చిరంజీవులుగా ఉంటారని సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి కావాల్సిన రక్షణను సైనికులు ఇస్తున్నట్లు, ప్రతి ప్రజానీకానికి హనుమంతుడి పూజ ప్రధానమని పేర్కొన్నారు. ఎన్నారై డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల మాట్లాడుతూ విశేష పూజలు అందుకునే హనుమంతుడి ఆశీర్వాదాలు ఆయన నియమ నిబంధనలు పాటిస్తే అందరికీ కలుగుతాయన్నారు. అనంతరం బాణసంచాల ధ్వనుల మధ్య నగరంలో నివసిస్తున్న కొందరు సైనికులను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు, నగర ప్రజలకు తీర్థ ప్రసాదాలను అందజేసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ తిరుమల, డాక్టర్ తిప్పయ్య స్వామ, డాక్టర్ సతీష్, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ సురేంద్ర తదితరులు, బిజెపి నాయకుడు గుండాల గోపీనాథ్, సదరు సంస్థ సభ్యులు బి.లక్ష్మణ్ కుమార్, రాటకొండ విశ్వనాథ్, విశ్వ, విష్ణు, హరి తదితరులు, శ్రీ వైద్యశాల సిబ్బంది భాష, సురేష్, కార్తీక్, సత్య, యశోద, అనిత తదితరులు పాల్గొన్నారు.
