

మన న్యూస్ పాచిపెంట,ఏప్రిల్ 26:- నవధాన్యాల సాగు మూడు నుండి ఐదు సంవత్సరాల పాటు చేపట్టడం ద్వారా ఎలాంటి ఎరువులు వాడకుండానే రసాయన ఎరువులు సగానికి తగ్గించి అధిక దిగుబడులు పొందవచ్చని పాచిపెంట మండల రైతులు రేయి వెంకట్రావు,లండ నారాయణరావు తెలిపారు.శనివారం నాడు ప్రకృతి వ్యవసాయ ప్రాంతీయ శిక్షకులు హేమ సుందర్ వద్ద తమ అనుభవాలను వివరించారు.గత మూడు సంవత్సరాలుగా వేసవిలో పీఎండీఎస్ నవధాన్య విత్తనాలను వేసి పత్తి మరియు మొక్కజొన్న మూడు ఎకరాలలో సాగు చేస్తున్నానని భూమి ఆరోగ్యం మెరుగుపడటం వలన రసాయన ఎరువులపై పెట్టుబడి తగ్గడమే కాకుండా ప్రస్తుతం దిగుబడి కూడా పెరిగిందని అమ్మ వలస గ్రామ రైతు రెయ్యి వెంకట్రావు అన్నారు. అనంతరం కర్రివలసలో తమ వరి వ్యవసాయ క్షేత్రంలో గత ఐదు సంవత్సరాలుగా పీఎండిఎస్ నవధాన్య విత్తనాలను సాగు చేస్తున్నానని ప్రస్తుతం ఎలాంటి రసాయన ఎరువులు వాడకపోయినా చుట్టుపక్కల రైతుల కంటే ఎక్కువగానే దిగబడి వస్తుందని దీనిని చూసి ఈ సంవత్సరం ఆ రైతులందరూ నవధాన్యాల సాగుకు ముందుకు వస్తున్నారని తాను కూడా తన పది ఎకరాల పత్తి మరియు మొక్కజొన్న క్షేత్రాలలో ప్రస్తుతం పీఎండీఎస్ నవధాన్యాల వేస్తున్నానని తెలిపారు. దీనివలన కలుపు రాకుండా ఉంటుందని పంట ఆరోగ్యంగా ఎదగడమే కాకుండా అధిక దిగుబడి వస్తుందని రైతు లండా నారాయణరావు తెలిపారు.ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ ప్రాంతీయ శిక్షకులు హేమ సుందర్ మాట్లాడుతూ మండలంలో రైతులు కొన్ని సంవత్సరాలుగామొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేస్తూ ఉండడం వల్ల ప్రస్తుత మొక్కజొన్న పంట రసాయన ఎరువులకు స్పందించడం తగ్గడం వలన దిగుబడులు తగ్గుముఖం పట్టాయని దీనిని నివారించాలంటే ఏకైక మార్గం పీఎండీఎస్ నవధాన్యాలు విత్తనాలు సాగు చేసి కలియ దున్ని మొక్కజొన్నతో పాటుగా బహుళ పంటలు వేసుకుంటే దిగుబడులు గణనీయంగా పెరగడమే కాకుండా భూమి యొక్క భౌతిక స్వభావం మెరుగుపడి భూమిలో ఉన్న సూక్ష్మజీవుల వృద్ధి జరిగి పంటకు కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయని అంతేకాకుండా మిత్ర పురుగుల వృద్ధి జరుగుతుందని భూమి యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని వేసవిలో సారవంతమైన మట్టి కొట్టుకొని పోకుండా ఉంటుందని నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగడం వల్ల రసాయన ఎరువులపై ఖర్చు తగ్గుతుందని కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా పీఎండిఎస్ నవధాన్య విత్తనాలను కలియదున్నారని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి తిరుపతిరావు ప్రకృతి సేద్య సిఆర్పిలు విజయ్ తిరుపతి నాయుడు శ్రీను సురేష్ కుమార్ మరియు సుమలత పాల్గొన్నారు.
