

Mana News :- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు పూర్తవుతోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి పుంజుకునేందుకు విపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అయితే పార్టీ నేతలు కేసులు, అరెస్టుల భయంతో ఇళ్ల నుంచి కదలడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఏదైనా నిరసనలకు పిలుపునిస్తుంటే స్పందన అంతంత మాత్రంగా ఉంటోంది. దీంతో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు వెంటనే పూర్తి చేయాలని సజ్జల ఆదేశించారు. ఏ నియోజకవర్గంలో కూడా జాప్యం జరగకూడదన్నారు. జనరల్ సెక్రటరీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, కేంద్ర కార్యాలయం నుంచి ఇంఛార్జ్‌లు అందరూ అందుబాటులో ఉంటారని, కమిటీల విషయంలో జాప్యం జరగడానికి వీల్లేదని అధినేత జగన్ చెప్పినట్లు వారికి తెలిపారు.కమిటీల పై సీరియస్ గా దృష్టిపెట్టాలని, జిల్లా అధ్యక్షులు వెంటనే వీటిపై స్పందించాలని సజ్జల ఆదేశించారు. కమిటీల నియామకం పూర్తయితే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా మంచి స్పందన వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి వారికి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, పార్టీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం సమిష్టిగా పనిచేసి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అధినేత వైయస్ జగన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని వెల్లడించారు.
