మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: రైతులు ఒకే రకమైన వరి, పత్తి పంటలు సాగు చేయకుండా కూరగాయలు, ఆయిల్ ఫామ్ తోటలు, పండ్ల తోటల సాగుపై మొగ్గు చూపాలని, అలాగే ప్రకృతి వ్యవసాయం చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సూచించారు. శనివారం మక్తల్ మండలం లోని జక్లేర్ గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో గ్రామ భారతి సత్య దర్శనం సహకారంతో ప్రకృతి వ్యవసాయం పై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం పై ఆసక్తి చూపుతున్నారని, ఇది శుభ సూచకం అన్నారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీమ్ ప్రవేశ పెట్టిందన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వ పరంగా సహకరిస్తాం అని ఆమె చెప్పారు. మార్కెటింగ్ చాలా ముఖ్యమని, బ్లాక్, బ్రౌన్ రైస్ ప్రొడక్షన్, ఆర్గానిక్ ఫామ్ లను సింగిల్ బ్రాండ్ మీద తీసుకు వెళ్ళేందుకు అందరి సహకారం అవసరం అన్నారు. అలాగే ఎఫ్. పీ. ఓ, ఎస్ హెచ్ జీల ద్వారా మార్కెటింగ్ లింక్ అవసరమని తెలిపారు. ఆర్గానిక్ ట్యాగ్ తో విక్రయించడానికి పెద్ద పెద్ద మార్కెట్ల లింక్ ఉండాలన్నారు. ప్రకృతి వ్యవసాయ శిక్షణ కేంద్రం ఏర్పాటు కు, ఫౌండేషన్ సభ్యులు అడిగిన వాటికి ప్రభుత్వ పరంగా తన వంతు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య వైద్య శాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, ఫౌండేషన్ సభ్యులు సత్య నారాయణ, రైతులు పాల్గొన్నారు.
