

అధిష్టానం మాటే శాసనం – పయ్యావుల కుటుంబం నిర్ణయమే కీలకం.
ఉరవకొండ,మన న్యూస్ : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గ కేంద్రమైన ఉరవకొండలో పదవుల పందేరం జోరుగా సాగుతోంది. వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పెన్హోబిలం దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, సింగిల్ విండో అధ్యక్ష పదవులపై తీవ్ర ఊహాగానాలు, అంతర్గత చర్చలు చోటుచేసుకుంటున్నాయి. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవికి టిడిపి సీనియర్ నాయకుడు, మండల పార్టీ కన్వీనర్ నరిసేటి విజయ్‌కు భాస్కర్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన పార్టీకి విధేయతతో పాటు అందరినీ కలుపుకొని నడిచే స్వభావం కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు. అయితే ఇదే పదవికి రాయంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకుడు రేగాటి నాగరాజు కూడా ఆశావహుడిగా నిలిచారు. గతంలో ఆయన మార్కెట్ యార్డు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈసారి తిరిగి ఆ బాధ్యత తనకే రావాలని బహిరంగంగానే ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయనకు పెన్హోబిలం పాలకమండలి చైర్మన్ హోదా అప్పగించే అవకాశం ఎక్కువగా ఉందని ప్రచారం సాగుతోంది.

ఇక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవి ఉరవకొండ పట్టణానికి చెందిన మాజీ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్, సీనియర్ టిడిపి నాయకుడు ఏళ్ల తిమ్మప్పకు వరించే అవకాశముందని చర్చ జరుగుతోంది. పార్టీ పట్ల ఎలాంటి అరమరికలు లేకుండా ఆయన చూపుతున్న కృషి, సేవాభావం ఈ పదవికి ఆయన్ను అర్హుడిగా నిలిపాయి. గతంలో ఈ బాధ్యత తూర్పుంటి ఏళ్ల శంకరప్ప భరించారు. తిమ్మప్పకు ఆ బాధ్యత దక్కితే ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించగలరన్న నమ్మకం కార్యకర్తల్లో ఉంది.
సింగిల్ విండో అధ్యక్ష పదవికి కూడా అనేకమంది ఆశావహులు ఉన్నారు. అయితే ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఏ స్థాయి నాయకులను ఏ స్థాయికి తీసుకువెళ్లాలి అనేది పయ్యావుల కుటుంబ నిర్ణయాధికారంపైనే ఆధారపడి ఉంది. త్వరలోనే ఈ పదవులపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.