

మన న్యూస్ ఉరవకొండ: ఉరవకొండలో యూరియా కొరత సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఫర్టిలైజర్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఉరవకొండ సిపిఎం మండల కన్వీనర్ మధుసూదన్,కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి,నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సురేష్,వెంకటేశులు డిమాండ్ చేశారు.సోమవారం ఉరవకొండ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలలో ఉన్న మండల వ్యవసాయ అధికారి రామకృష్ణకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫర్టిలైజర్స్ నిర్వాహకులు అందరూ సిండికేట్ గా ఏర్పడి ఇతర ఎరువులను తీసుకున్నవారికి మాత్రమే యూరియా ఇస్తామని యూరియాతోపాటు ఇతర ఎరువులు తీసుకోకపోతే ఇచ్చేది లేదంటూ నిర్లక్ష్య సమాధానాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉరవకొండ మండల వ్యాప్తంగా రైతులను ఇబ్బందులకు గురి చేసేలా ఫర్టిలైజర్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారన్నారు.వారి వద్ద యూరియా ఉన్నప్పటికీ రైతులకు ఇవ్వకుండా మా దగ్గర స్టాక్ లేదంటూ వెనక్కి పంపుతున్నారని యూరియా కోసం రైతులు ఎక్కడికి వెళ్లాలంటూ వ్యవసాయ అధికారిని ప్రశ్నించారు.సమస్యపై స్పందించిన వ్యవసాయ అధికారి రామకృష్ణ వెంటనే ఫర్టిలైజర్స్ నిర్వాహకులకు వారి ఎదుట ఫోన్ చేసి మాట్లాడారు.ప్రతి రైతుకు కచ్చితంగా యూరియాను ఇవ్వాలని మరోసారి రైతులు వద్ద ఇలా ప్రవర్తిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ప్రతి ఒక్కరూ వారి షాపుల ఎదుట అక్కడ ఉన్నటువంటి మందుల వివరాలకు సంబంధించిన స్టాక్ బోర్డు కచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. సిసిఆర్సి కార్డులు ఉన్న కౌలు రైతులందరికీ బ్యాంకులో క్రాప్ లోన్ రుణాలు పంపిణీ చేసేలా బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జ్ఞానమూర్తి,సీనప్ప,కౌలు రైతు సంఘం నాయకులు సుంకన్న,రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.