

మన న్యూస్ పాచిపెంట, జూలై 6:- విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసిన తరువాత మాత్రమే విత్తనాలను నారు పోసుకుంటే భూమి ద్వారా విత్తనం ద్వారా వ్యాపించే శిలీంద్రాల నుండి తెగుళ్ల నుండి పంటకు రక్షణ కల్పించవచ్చని ఏపీ సిఎన్ ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎం శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు మండలం పాంచాలి గ్రామంలో సామూహిక విత్తన శుద్ధి కార్యక్రమంలో మాట్లాడుతూ బీజామృతంతో విత్తనాలను శుద్ధి చేయడం వలన తెగుళ్ళ నుండి రక్షణ పొందడమే కాకుండా విత్తన మొలక శాతం కూడా పెరుగుతుందని తెలిపారు. 100 లీటర్ల నీటికి ఐదు లీటర్ల ఆవు మూత్రం కలిపి దానిలో 10 కేజీల ఆవు పేడను ఒక గుడ్డ సంచిలో మునిగి ఉండేటట్లు ఒక రోజంతా ఉంచి మరుసటి రోజు ఆ ద్రావణానికి 250 గ్రాముల సున్నం కలిపి సరిపడినంత విత్తనానికి పిచికారీ చేసుకుంటూ ద్రావణాన్ని బాగా పట్టించి రెండు గంటలు ఆరబెట్టిన తర్వాత నారు పోసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ యుగంధర్ మాట్లాడుతూ ఎలాంటి ఖర్చు లేకుండా తయారయ్యే బీజామృతం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కేవలం 10 నిమిషాల శ్రమతో మన పంటలను రక్షించుకోవచ్చు అని కాబట్టి రైతులందరూ ఈ విధానాన్ని తప్పక పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు.విత్తనాల బేజామృత శుద్ధి అనంతరం నారు శుద్ధి కూడా బేజామృతం లో ముంచి చేసుకుంటే మరింత ఫలితాలు వస్తాయని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదిబిల్లి శ్రీను ప్రకృతి సేద్య ప్రతినిధులు యశోదమ్మ తిరుపతి నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు.
