మన న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలో KVK, కందుకూరు ఆధ్వర్యంలో “వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి KVK సైంటిస్ట్ డా. ఐ. వెంకటేష్, మండల వ్యవసాయాధికారి సుధాకర్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయాధికారి సుధాకర్ మాట్లాడుతూ, పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు కావలసిన రైతులు తమ గ్రామ రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరాలు రైతులకు తెలియజేశారు.డా. ఐ. వెంకటేష్ మాట్లాడుతూ, తెల్ల చవుడు నియంత్రణకు జీలుగ వేనుకొని పూతకు ముందు నేలలో కలియదున్నాలని, మట్టి పరీక్షల ఆధారంగా పోషకాల యాజమాన్యం చేపట్టాలని సూచించారు. జీవన ఎరువులు, అజొల్లా, భాస్వరాన్ని మరియు పొటాస్‌ను కలిగించే బ్యాక్టీరియా వాడాలని, సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వివరించారు.
పశువుల పేడ పెంచిన ట్రైకోడెర్మా వంటి జీవ శిలీంద్రాలు నేల వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని చెప్పారు. సమగ్ర సస్య రక్షణలో భాగంగా లింగాకర్షణ బుట్టలు, రంగు అట్టలు, పక్షిస్థావరాలు, రక్షక పంటలు, జీవ కీటకనాశనులు, సరైన మోతాదులో రసాయనాలు వాడాలని సూచించారు. పొలాల్లో కలుపు నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సీనియర్ సైంటిస్ట్ డా. గంగాధర్ రైతుల సమస్యలు అడిగి తెలుసుకొని, వాటికి పరిష్కారాలు, కొత్త పంట రకాల వివరాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. డా. శ్రీరంగ పాడి పశువుల నిర్వహణపై ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివరించగా, డా. నిహారిక మహిళలకు విలువ ఆధారిత పదార్థాలపై అవగాహన కల్పించారు. సైలజా, కృష్ణా ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *