

మన న్యూస్:- కందుకూరు, ఏప్రిల్ 28:–
- మన్నేటిగుంటలో సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ
- భూమిపూజలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి
- సబ్ స్టేషన్ నిర్మాణం రైతులకు ఎంతో ఉపయోగం
- చుట్టుపక్కల ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం
- ఉలవపాడు మండలంలోని మన్నేటికోట పంచాయతీలో సోమవారం నాడు 33/11 కె.వి. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం మీడియాతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… నిరంతర త్రీ ఫేస్ విద్యుత్ సరఫరాతో మన్నేటికోట పరిసర ప్రాంతాల్లో ఇకపై అర్ధాంతరంగా పవర్ ట్రిప్ కావడం, లోవోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోయి రైతులు నష్టపోయే పరిస్థితులు తలెత్తవన్నారు. అధికారంలోనికి వచ్చిన పది నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంతల రహిత రోడ్ల ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు. సాంప్రదాయ విద్యుత్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా ప్రతి ఇంట్లో సోలార్ పవర్ వినియోగించి పెంచాలన్న ఉద్దేశంతో కేంద్రం పీఎం సూర్యఘర్ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఇందులో ఎస్సి, ఎస్టీలకు సోలార్ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. బిసిలకు కేంద్ర ప్రభుత్వం యిచ్చే 60 వేల సబ్సిడీతో పాటు రాష్టం మరో 20 వేలు ఇస్తుందన్నారు. కేంద్ర, రాష్ట ప్రభత్వాలు యిచ్చే సబ్సిడీలు సద్వినియోగం చేసుకొని ప్రజలు సోలార్ విద్యుత్ వినియోగం వైపు మొగ్గు చూపాలన్నారు. త్వరలోనే సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. భూమిపూజ అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ పూర్తయితే సమీపంలో ఉన్న నాలుగు గ్రామాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గ్రామాలకు నిరవధిక విద్యుత్ సరఫరా లభిస్తుందని, ఇది రైతులకు ఎంతగానో ఉపయోగమని పేర్కొన్నారు. అలాగే కేవలం రైతులకు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయంగా మారుతుందని అన్నారు. గత ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, వాటికి త్వరలోనే తగిన శాస్తి తప్పదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని వెల్లడించారు.ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో 4 సబ్ స్టేషన్ కు అనుమతులు లభించాయని, వాటిలో మొదటి విడతగా ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మిగిలిన 3 సబ్ స్టేషన్ లో కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. మన్నేటికోట ప్రాంతంలో ఎక్కువ రైతులు మామిడి, సపోటా తోటలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారికి గతంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్నారని, ఈ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సబ్ స్టేషన్ మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీవో శ్రీపూజ, తదితరులు పాల్గొన్నారు.
