

Mana News :- దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆయన చిత్రంలో ఉన్న హింసాత్మక దృశ్యాలు, భావోద్వేగపూరిత సన్నివేశాలు చర్చనీయాంశమయ్యాయి.ఇప్పుడు ఆయన ‘యానిమల్ పార్క్’ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో పాల్గొన్న సందీప్ తన అనుభవాలను పంచుకున్నారు.’యానిమల్’పై వచ్చిన విమర్శల గురించి సందీప్ స్పందిస్తూ..’గతంలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్’ లాంటి సినిమాలు తీయకూడదు. ఆ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లింది అని అన్నారు. నిజంగా ఆయన అలా అనడం నన్ను ఎంతో బాధించింది. ఆయన మాట్లాడిన తీరు చూస్తే, నేను ఏదో పెద్ద నేరం చేసినట్లుగా అనిపించింది. నా సినిమా గురించి ఆయన చేసిన విమర్శలు నాకు అనవసరంగా, అత్యుత్సాహంగా అనిపించాయి’ అని చెప్పుకొచ్చారు.ఇక అలాంటి మాటలు విని తనకు చాలా కోపం వచ్చిందన్న సందీప్.. కానీ ఆ తర్వాత తాను ఒక విషయాన్ని గమనించానన్నారు. ఐఏఎస్ కావాలంటే దిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకుని రెండేళ్లు, మూడేళ్లు కష్టపడితే సాధించవచ్చు. అందుకోసం ప్రత్యేకమైన పుస్తకాలు, మార్గదర్శకులు ఉంటారు. కానీ ఓ ఫిల్మ్‌మేకర్ కావాలంటే? ఓ రచయితగా ఎదగాలంటే? దీని కోసం ఎక్కడైనా కోచింగ్ సెంటర్లు లేదా పక్కనే ఓ టీచర్ ఉంటారా? అసలు ఇది నేర్చుకోవడానికి ఎలాంటి సిస్టమ్ లేదు. పూర్తిగా మన స్వయంకృషిపై ఆధారపడి ఉండాలి. రచనకు, కథనానికి, దర్శకుడిగా అభివృద్ధి చెందడానికి ఒక్కో వ్యక్తి స్వంతంగా ప్రయాణం చేయాలి. అందుకే, నన్ను నేను నమ్ముకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా” అని పేర్కొన్నారు.కాగా సందీప్ ప్రస్తుతం యానిమల్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న యానిమల్ పార్క్‌తో పాటు ప్రభాస్ హీరోగా స్పిరీట్ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.