• గ్రామస్తుల ఏళ్లనాటి కల సాకారం.
  • 2026–27 విద్యా సంవత్సరం నుంచే 7వ తరగతి వరకు విద్యాబోధనకు అవకాశం.
  • మన ధ్యాస,మక్తల్: మండల పరిధిలోని మాద్వార్ గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమిష్టి కృషి ఫలితంగా మాద్వార్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరం నుంచే ఏడవ తరగతి వరకు విద్యాబోధనకు అనుమతులు లభించడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.ఈ సందర్భంగా గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో గ్రామస్తుల అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి ఖాజా అమీర్‌ఉద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఖాజా అమీర్‌ఉద్దీన్ మాట్లాడుతూ, గ్రామస్తులందరి సమిష్టి కృషి, విద్యాభివృద్ధిపై ఉన్న ఆసక్తి అభినందనీయమన్నారు. గ్రామ ప్రజల ఆకాంక్షలను గుర్తించి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రాథమికోన్నత పాఠశాలగా అనుమతులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ఇకపై ఏడవ తరగతి వరకు విద్యార్థులు తమ గ్రామంలోనే చదువుకునే అవకాశం కలగడం గొప్ప విషయమని పేర్కొన్నారు.అనంతరం గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,గత ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు పైచదువుల కోసం ఇతర గ్రామాలకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను దగ్గరగా చూశానన్నారు. బస్సులు అందుబాటులో లేక ఆలస్యంగా పాఠశాలలకు చేరుకోవడం, ప్రయాణ ఇబ్బందులతో కొందరు మధ్యలోనే చదువును ఆపేయడం తనను ఎంతగానో బాధించేవని తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారంగా తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలోనే ప్రాథమికోన్నత పాఠశాలగా ఉత్తర్వులు రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.భవిష్యత్తులోనూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అవసరాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి సహకరించిన గ్రామ పెద్దలను ఉపాధ్యాయ బృందం శాలువాలతో సన్మానించారు. గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన కృషిని అభినందిస్తూ మండల విద్యాధికారి, ఉపాధ్యాయ బృందం, గ్రామ యువత ఆయనను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకట రాములు, రామాంజనేయులు, రాములు, వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజేష్, గ్రామ పెద్దలు సంతోష్ రెడ్డి, రాజేశ్వరరావు, గాల్ల రాములు, డాక్టర్ ఎం. ఆశప్ప, బుడబోయి చంద్రప్ప, జి. రామకృష్ణ, ఆర్‌ఎంపీ జంగం బసవరాజ్, జగదీష్, కర్నె బాలరాజ్ (నవతెలంగాణ రిపోర్టర్), జి. ఎర్ర తాయప్ప, ఎర్రంకొల్ల పెద్ద లక్ష్మయ్య, ఉపసర్పంచ్ కె. శివాని, వార్డు సభ్యులు బాట నరసింహ, జయమ్మ, గుడిసె పాపమ్మ, పాఠశాల కమిటీ చైర్మన్ కె. అంజమ్మ, జి. రాజు, గంట్ల నరసప్ప, నాగరాజు, పంచాయతీ సిబ్బంది బి. నరేష్, కురువ వెంకటేష్, పోలీస్ ముకుంద రెడ్డి, బాట నరసింహ (జంగం), కర్నే శ్రీనివాస్ ఫీల్డ్ అసిస్టెంట్ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *