కలిగిరి, అక్టోబర్ 1, మన న్యూస్ RC ఇన్చార్జి నాగరాజు..
నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్లో గురువారం నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. పాఠశాల ప్రాంగణంలో ఉదయం నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.చైర్మన్ పదవికి ముసాపురం గ్రామానికి చెందిన మద్దినేని వెంకటేశ్వర్లు, అదే గ్రామానికి చెందిన రవికుమార్ ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. చివరకు జరిగిన ఓటింగ్ లో మద్దినేని వెంకటేశ్వర్లు తన సమీప ప్రత్యర్థి రవికుమార్ పై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా వసంత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.అదేవిధంగా కలిగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎన్నికల్లో చైర్మన్ గా చల్లా వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా జూవిగుంట హరిప్రియ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని మండల విద్యాశాఖాధికారి (MEO) సురేష్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు జి.వెంకటేశ్వర్లు దగ్గరుండి నిర్వహించారు.ఎన్నికలు పూర్తయిన అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లతో పాటు కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని నూతన చైర్మన్లు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పూలమాలలు వేసి ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
