
* 25 ఏళ్లుగా అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష సేవలు
* బెంగళూరులో ఘనంగా గౌరవ డాక్టరేట్ ప్రదానం
చిత్తూరు, నవంబర్ 15 – మన ద్యాస (నాగరాజ సరకింటి )
సామాజిక సేవా రంగంలో 25 ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్న తవణంపల్లి మండలం పుణ్యసముద్రం గ్రామానికి చెందిన ఎం. డేవిడ్‌కు అరుదైన గౌరవం లభించింది. అణగారిన వర్గాల అభ్యున్నతి, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన విశేష కృషిని గుర్తించిన బెంగళూరులోని భారతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. నవంబర్ 12, 2026న బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ఘనంగా అందజేశారు.
గత 25 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, సామాజిక చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాల్లో ఎం. డేవిడ్ చురుకుగా పాల్గొంటున్నారు. సామాజిక సేవనే లక్ష్యంగా చేసుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు.ప్రస్తుతం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లేబర్ రైట్స్ విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ కార్మికుల హక్కులు, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. రాజకీయ రంగంలోనూ ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ పుణ్యసముద్రం గ్రామ పంచాయతీ ఎం.పీ.టీ.సీగా పనిచేశారు. అదేవిధంగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంబంధించిన జిల్లా, మండల స్థాయి కమిటీల్లో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించి ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా అధికారుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లడంతో పాటు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. వివిధ రంగాల్లో ఆయన అందించిన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
25 ఏళ్లుగా ప్రజాసేవకు అంకితమై పనిచేస్తున్న ఎం. డేవిడ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడం పుణ్యసముద్రం గ్రామంతో పాటు తవణంపల్లి మండలం, చిత్తూరు జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.