​పుస్తకాలు మంచి స్నేహితులతో సమానం: బి.ఎం.ఎస్ జిల్లా కార్యదర్శి వెంకటాద్రి యాదవ్.
​విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్న పుస్తక ప్రదర్శన..

​రేణిగుంట:
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం స్థానిక శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను అత్యంత ఘనంగా నిర్వహించారు.
​ఆకట్టుకున్న విజ్ఞానదాయక పుస్తకాలు:
గ్రంథాలయ అధికారి నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విద్యార్థులు, పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠకులలో పఠనాసక్తిని పెంపొందించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రదర్శనలో ఆధ్యాత్మిక గ్రంథాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, బాలల నీతి కథలు, కవిత్వం, నీతి శతకాలు, నవలలు, నాటికలతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విజ్ఞానదాయక పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
​పుస్తక పఠనం గొప్ప అలవాటు:
కార్యక్రమంలో పాల్గొన్న బి.ఎం.ఎస్ జిల్లా కార్యదర్శి వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం చేయడం ఒక గొప్ప అలవాటని కొనియాడారు. పుస్తకాలు మంచి స్నేహితులతో సమానమని, అవి మనిషిలో ఉన్నతమైన ఆలోచనలు, మంచి ప్రవర్తన మరియు సద్భావనను పెంపొందిస్తాయని తెలిపారు.
​సిబ్బంది కొరతను తీర్చాలని డిమాండ్:
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది లేక ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై అధిక పనిభారం పడుతోందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రంథాలయ ఉద్యోగాలను భర్తీ చేసి వారిపై పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానిక పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *