తవణంపల్లి, మన ధ్యాస జనవరి-03 మండలం లోని ఎగువ మారేడు పల్లి గ్రామంలో వెలసి ఉన్న మహాదేవేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి పూజోత్సవం భక్తుల భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మృత్యుంజయ మహామంత్ర ఘోషతో పాటు “ఓం నమశ్శివాయ” నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజోత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు. పూజోత్సవంలో భాగంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి, అనంతరం చందన అలంకరణ చేశారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్పిళ్ళై, మురళి, బాలాజీ ఆచారి, కౌశిక్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్, మునెమ్మ తదితరులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. మహాదేవేశ్వర స్వామి ఆలయ విశిష్టత ఈ ఆలయంలో మహాదేవేశ్వర స్వామి యోగేశ్వరుడిగా ఏక స్వామిగా వెలసి ఉన్నారు. సాధారణంగా శివాలయాల్లో స్వామి ముందు నంది దర్శనం ఇస్తే, ఇక్కడ మాత్రం స్వామివారే ముందుగా దర్శనమిస్తారు. పరివార దేవతలు గానీ, అమ్మవారు గానీ ఈ ఆలయంలో లేరు. స్వామివారు యోగనిష్టలో ఉన్నట్లు విశ్వాసం. పౌర్ణమి రోజున మాత్రమే స్వామివారు ముఖ దర్శనమిస్తూ చందనంతో అలంకరింపబడతారు. ఈ ప్రత్యేక రోజున భక్తులు స్వామివారిని దర్శించి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. భక్తుల కష్టాలను తీర్చి, కోరిన వారికి కొంగుబంగారమై ఆదరించే మహాదేవేశ్వర స్వామి కృపతో గ్రామంలో శాంతి, సుభిక్షత నెలకొంటున్నాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.
