మన ధ్యాస కర్నూల్ :కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం న్యాయవాదులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, అలాగే రాష్ట్ర అసెంబ్లీకి వేల సంఖ్యలో పోస్టుకార్డులు పంపించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించారని గుర్తు చేశారు. 2024లో ఎన్నికలకు ముందు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, రెండు సంవత్సరాలు గడిచినా ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ హామీని నిలబెట్టుకోవాలని, తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు సాధన సమితి పేర్కొంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు రాయలసీమ ప్రజలందరినీ ఈ ఉద్యమంలో భాగం చేసి నిరసనను కొనసాగిస్తామని హెచ్చరించారు.









