

మన న్యూస్, విడవలూరు, ఆగస్టు 23:భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అలఘనాధ స్వామి ఆలయ కమిటి నిర్వాహకులను కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని అలఘనాధ స్వామి ఆలయ కమిటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమక్షంలో నూతనంగా ఏర్పడ్డ ఆలయ కమిటి ఛైర్మన్ గా ఉచ్చూరు సుదీప్ రెడ్డి తో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…….. ఆలయ చైర్మన్ అనేది ఒక పదవి కాదని స్వామి వారి సన్నిధిలో సేవ చేసే అవకాశమన్నారు. 750 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగి చోళ రాజులు నిర్మించిన అలఘనాధ స్వామి ఆలయ విశిష్టతను కాపాడాలని కోరారు. ఆలయ పవిత్రత కాపాడే విషయంలో దేవస్థాన కమిటి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిందిగా ఆమె సూచించారు. ఆలయ కమిటి మరియు గ్రామస్థుల సమిష్టి కృషితో అలఘనాధ స్వామి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్షులు ఏటూరి శ్రీహరి రెడ్డి, నీటిసంఘం ఛైర్మెన్ పాశం శ్రీహరి రెడ్డి, టిడిపి నాయకులు అడపాల శ్రీధర్ రెడ్డి లతో పాటు స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


