

గూడూరు, మన న్యూస్ :- కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) గూడూరు-నాయుడుపేట డివిజన్ ఉపాధ్యక్షులు చిరమన సాయిమురళి అధ్యక్షతన బుధవారం, గూడూరు పట్టణంలోని మాయాబజారు రోడ్ లోని కెవి హాస్పిటల్స్ సమావేశ మందిరము నందు కిడ్నీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ పై అవగాహన సదస్సు జరిగినది. ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ మూత్రపిండ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.రాఘవేంద్ర మాట్లాడుతూ పీఎంపీలు మూత్రపిండ వ్యాధులపట్ల అవగాహన కలిగిఉండి గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేసి వారు కిడ్నీ వ్యాధి బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కిడ్నీ వ్యాధులలో అధిక రక్తపోటు, కాళ్లు, చేతులు, ముఖంవాపు కలిగి ఉండడం, చిన్న పనికే అలసట, నీరసంగా ఉండడం, తరచూ మూత్ర విసర్జన చేయడం, మూత్రంలో రక్తం పడడం తదితర వ్యాధులతో బాధపడే వారికి తక్షణం వైద్య చికిత్సలు చేయాలని తెలిపారు. నారాయణ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వి.ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్యాస్ ట్రబుల్ కు సంబంధించి పిత్తాశయంలో రాళ్లు, కడుపునొప్పి, పసరికలు/కామెర్లు, ఊబకాయం, మలబద్ధకం, రక్తపు వాంతులు, కడుపులో నీరు చేరడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, మింగడంలో ఇబ్బంది కలగడం లాంటి సమస్యలు ఉన్నవారు వెంటనే వైద్యున్ని సంప్రదించి, వ్యాధి నిర్ధారణ చేసుకుని మందులు వాడుకుంటూ, బలమైన పౌష్టికాహారం తీసుకోవాలన్నారు., తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకుంటున్నట్లయితే వ్యాధి ప్రబలకుండా ఉంటుందని తెలియజేశారు. అనంతరం పీ.యం.పీ నాయకులు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, డాక్టర్ రాఘవేంద్ర, కె.వి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ త్రివిక్రమ్, డాక్టర్ కీర్తిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఏవో వెంకటేశ్వర్లు, డివిజన్ పిఎంపి నాయకులు సి.సాయిమురళి, షేక్ కరీముల్లా, ఈ.సాంసన్, పి.చంద్రమోహన్, టి.శంకరమ్మ డి.కవిత తదితరులు పాల్గొన్నారు.