

హిందూపురం: రాష్ట్ర ప్రభుత్వం సూపర్-6 పథకాలన్నింటినీ అమలు చేసిందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధి విషయంలో మాత్రం చేతులెత్తేశారని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శ్రీమతి టి.ఎన్. దీపిక మండిపడ్డారు.
మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ఇచ్చిన ప్రకటనలో ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఇంటింటికీ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు, ఇప్పుడు మాత్రం ఆ మాటలన్నింటినీ వెనక్కి తీసుకుంటూ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు నిధిలేదంటూ బాధ్యతాజ్ఞత లేని మాటలు మాట్లాడుతోందని విమర్శించారు.
ఆడబిడ్డల భవిష్యత్తును అన్యాయంగా తాకట్టు పెట్టిన ఈ వైఖరిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని టి.ఎన్. దీపిక స్పష్టం చేశారు.