

మన న్యూస్,తిరుపతిః– తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైయ్యాయి. చాటింపు తరువాత బుధవారం భక్తులు భైరాగి వేషంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆలయ అధికారులు, ఉత్సవకమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆలయప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధిపనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిభిరాన్ని ఎమ్మెల్యే పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బైరాగి వేషం వేసుకున్న పిల్లల కోరిక మేరకు వాళ్ళతో ఎమ్మెల్యే ఫోటో దిగారు. కాగా భక్తులకు మెరుగైన దర్శనం కల్పించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సామాన్యులకు శీఘ్రగతిన దర్శనం కల్పించడంతో పాటు ప్రత్యేక దర్శనం చేసుకునే వారికి ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. మొదటి రోజు పదివేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆయన చెప్పారు. గురువారం బండ వేషంతో అమ్మవారిని భక్తులు మొక్కులు తీర్చుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ జాతర ఉత్సవ కమిటీ నాయకులు బండారి బాలసుబ్రమణ్యం రెడ్డి, నైనార్ మహేష్ యాదవ్, జలపోతు చంద్రశేఖర్ రెడ్డి, అశోక్, ఆవులపాటి బుజ్జిబాబు జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి, కూటమి నాయకులు, అధికారులు, పాల్గొన్నారు.
