

కాసుల కోసం ఎం ఈ ఓ ఈశ్వరప్ప కక్కుర్తి.
-ఎం ఈ ఓ, డీ ఈ ఓ దొందూ, దొందే:
ఉరవకొండ, మన ధ్యాస:అనంతపురం జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ (AIFDS) రాష్ట్ర అధ్యక్షుడు సిద్దు ఒక ఫిర్యాదు అందజేశారు. ఉరవకొండ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్న జ్యోతి పాఠశాలకు అనుమతులు మంజూరు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) మరియు మండల విద్యాధికారి (MEO) ఈశ్వరప్పపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అక్రమ పాఠశాల కార్యకలాపాలు
సిద్దు మాట్లాడుతూ, జ్యోతి పాఠశాల రేకుల షెడ్డులో ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా నడుస్తోందని తీవ్రంగా ఆరోపించారు. గతంలో గాలివానకు పాఠశాల పైకప్పు రేకులు లేచిపోయినప్పటికీ, అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదని తెలిపారు. అంతేకాకుండా, విద్యార్థుల నుంచి ‘అబాకస్ కోర్సు’ పేరుతో వేల రూపాయల అదనపు రుసుములు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమాల గురించి ఫిర్యాదు చేసినా ఎంఈఓ ఈశ్వరప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం
“ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడుస్తున్నా, ఎంఈఓ ఈశ్వరప్ప డబ్బులకు ఆశపడి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. మేము అనేకసార్లు ఫిర్యాదులు చేసినా, మా వినతిపత్రాలను చెత్తబుట్టలో వేస్తున్నారు,” అని సిద్దు తీవ్రంగా మండిపడ్డారు.
ఈ అక్రమ కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చిన ఉన్నతాధికారులపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని, జ్యోతి పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని ఏఐఎఫ్‌డీఎస్ తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ఫిర్యాదుపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.