

గద్వాల జిల్లా, జూలై 19 (మన న్యూస్ ప్రతినిధి): జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు కర్రెన్న (75), సవారమ్మ అలియాస్ గట్టవ్వ (65) ఆర్థికంగా అత్యంత విషమ పరిస్థితులలో జీవిస్తున్నారు. నెలకు వచ్చే 2,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ మీదే వారి కుటుంబం ఆధారపడుతోంది. ఈ దంపతులకు ఒకే ఒక్క మనవరాలు శృతి, గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మంచం మీద ఉన్న అవ్వ తాతలను చూసుకుంటూనే చదువును కొనసాగిస్తోంది. ఇటీవల శృతి అనారోగ్యం పాలవడంతో కుటుంబం ఆర్థికంగా మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న వార్డు ఆశా వర్కర్ ఎస్. కాంతమ్మ, కర్రెన్న ఇంటికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి మానవతా దృష్టితో సమాజానికి తెలియజేశారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం అత్యవసరం. మనస్సు ఉన్న దాతలు ఫోన్ పే ద్వారా 6304040979 నెంబర్ కు ఆర్థికంగా సహాయం అందించి, ఈ కుటుంబానికి జీవితంలో కొంత వెలుగు నింపగలరని వృద్ధ దంపతులు కర్రెన్న, సవారమ్మ కన్నీటితో కోరుతున్నారు.